విలాప వాక్యములు - 5

1  ¶ యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు. 2  ¶ మా స్వాస్థ్యం పరదేశుల వశం అయ్యింది. మా ఇళ్ళు అన్యుల స్వాధీనం అయ్యాయి. 3  ¶ మేము అనాథలం అయ్యాం. తండ్రులు ఇంక లేరు. మా తల్లులు వితంతువుల్లా ఉన్నారు. 4  ¶ మా నీళ్లు మేము డబ్బుతో కొనుక్కుని తాగాం. మా కట్టెలు మాకే అమ్మారు. 5  ¶ వాళ్ళు మమ్మల్ని తరిమారు. మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు. 6  ¶ అన్నం కోసం ఐగుప్తీయులకూ అష్షూరీయులకూ చెయ్యి చాపాం. 7  ¶ మా పితరులు పాపం చేసి చనిపోయారు. మేము వాళ్ళ పాపానికి శిక్ష అనుభవిస్తున్నాం. 8  ¶ దాసులు మమ్మల్ని ఏలుతున్నారు. వాళ్ళ వశం నుంచి మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరు. 9  ¶ ఎడారి ప్రజల కత్తి భయంతో ప్రాణానికి తెగించి మా ఆహారం తెచ్చుకుంటున్నాం. 10  ¶ కరువు తాపం వల్ల మా చర్మం పొయ్యిలా కాలిపోతోంది. 11  ¶ శత్రువులు సీయోనులో స్త్రీలను, యూదా పట్టణాల్లో కన్యకలను మానభంగం చేశారు. 12  ¶ అధిపతులను వాళ్ళు ఉరి తీశారు. పెద్దలను ఘనపరచలేదు. 13  ¶ బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు. 14  ¶ పెద్దలను గుమ్మాల దగ్గర కూర్చోకుండా తొలగించారు. యువకులను సంగీతం నుంచి దూరం చేశారు. 15  ¶ మా గుండెల్లో ఆనందం అడుగంటింది. మా నాట్యం దుఃఖంగా మారిపోయింది. 16  ¶ మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ! 17  ¶ మా గుండెలకు జబ్బు చేసింది. మా కళ్ళు మసకబారాయి. 18  ¶ సీయోను పర్వతం నిర్జీవంగా ఉంది. దాని మీద నక్కలు తిరుగులాడుతున్నాయి. 19  ¶ యెహోవా, నువ్వు నిత్యం పరిపాలిస్తావు. నీ సింహాసనం తరతరాలు ఉంటుంది. 20  ¶ నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా? 21  ¶ యెహోవా, నువ్వు మమ్మల్ని నీ వైపుకు మళ్ళీ తిప్పు. మేము తిరుగుతాం. 22  ¶ నువ్వు మమ్మల్ని పూర్తిగా విడిచి పెట్టకపోతే, మా మీద నీకు విపరీతమైన కోపం లేకపోతే మా పూర్వస్థితి మళ్ళీ మాకు కలిగించు.