సామెత - 14

1  ¶ జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది. మూర్ఖురాలు చేతులారా తన కాపురం నాశనం చేసుకుంటుంది. 2  ¶ యెహోవాపట్ల భయం, భక్తి ఉన్నవాడు నిజాయితీగా మసులుకుంటాడు. కపటంగా ప్రవర్తించే వాడు ఆయనను తిరస్కరిస్తాడు. 3  ¶ మూర్ఖుల నోటిలో గర్వం అనే బెత్తం ఉన్నది. జ్ఞానం గలవారి నోటి నుంచి వచ్చే మాటలు వారిని కాపాడతాయి. 4  ¶ ఎద్దులు లేకపోతే కొట్లలో ధాన్యం ఉండదు. ఎద్దులు బలంగా ఉంటే అధిక రాబడి వస్తుంది. 5  ¶ నమ్మకమైన సాక్షి అబద్ధం పలకడు. కపట సాక్షికి అబద్ధాలు చెప్పడమే ఇష్టం. 6  ¶ బుద్ధిహీనుడు జ్ఞానం కోసం వెదికినా అది దొరకదు. తెలివిగలవాడు తేలికగా జ్ఞానం పొందుతాడు. 7  ¶ బుద్ధిహీనుడి దగ్గర మంచి మాటలు ఏమీ దొరకవు కనుక వాడితో స్నేహం చేయవద్దు. 8  ¶ వివేకం ఉన్నవారు తమ ప్రవర్తన విషయంలో జ్ఞానం కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. బుద్ధి లేనివారు తమ మూర్ఖత్వంతో మోసపూరిత కార్యాలు జరిగిస్తారు. 9  ¶ మూర్ఖులు చేసే అపరాధ పరిహార బలి వారిని ఎగతాళి చేస్తుంది. యథార్థవంతులు ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉంటారు. 10  ¶ ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు. 11  ¶ దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది. 12  ¶ ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది. 13  ¶ ఒకడు బయటికి నవ్వుతో ఉన్నప్పటికీ హృదయంలో దుఃఖం ఉండవచ్చు. సంతోషం చివరికి శోకంగా మారిపోవచ్చు. 14  ¶ భక్తిహీనుడి మార్గాలు చివరికి వాడికే వెగటు కలుగుతాయి. మంచి వ్యక్తి తన ప్రవర్తన పట్ల సంతృప్తి చెందుతాడు. 15  ¶ తెలివితక్కువవాడు ప్రతి విషయాన్నీ నమ్ముతాడు. వివేకం గలవాడు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహిస్తాడు. 16  ¶ జ్ఞానం ఉన్నవాడు కీడుకు భయపడి దాని నుంచి దూరంగా వెళ్తాడు. మూర్ఖుడు అహంకారంతో భయం లేకుండా తిరుగుతాడు. 17  ¶ తొందరగా కోపం తెచ్చుకునేవాడు తన మూర్ఖత్వం ప్రదర్శిస్తాడు. చెడు ఆలోచనలు చేసేవాడు ద్వేషానికి గురౌతాడు. 18  ¶ బుద్ధిహీనులు తమ మూర్ఖత్వమే ఆస్తిగా కలిగి ఉంటారు. వివేకం ఉన్నవారు జ్ఞానాన్ని కిరీటంగా ధరించుకుంటారు. 19  ¶ చెడ్డవారు మంచివారి ఎదుట, భక్తిహీనులు నీతిమంతుల గుమ్మాల ఎదుట నిలబడతారు. 20  ¶ దరిద్రుణ్ణి వాడి పొరుగువాడే అసహ్యించుకుంటాడు. ధనవంతుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలామంది. 21  ¶ పేదవారిని ఆదరించేవాడు ధన్యజీవి. తన పొరుగువాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినట్టే. 22  ¶ కీడు తలపెట్టేవారు కూలిపోతారు. మేలు చేసే వారికి దయ, సత్యం ప్రాప్తిస్తాయి. 23  ¶ కష్టంతో కూడిన ఏ పని చేసినా ఫలితం దక్కుతుంది. వ్యర్ధమైన మాటలు దరిద్రానికి నడుపుతాయి. 24  ¶ ఐశ్వర్యం జ్ఞానులకు కిరీటం వంటిది. బుద్ధిహీనుల మూర్ఖత్వం వారికి మరింత మూర్ఖత్వం తెచ్చిపెడుతుంది. 25  ¶ నిజాలు పలికే సాక్షి మనుషులను కాపాడతాడు. అబద్ధాలు చెప్పేవాడు కేవలం మోసగాడు. 26  ¶ యెహోవాపట్ల భయం, భక్తి కలిగి ఉన్నవారు ఎంతో ధైర్యంగా ఉంటారు. వారి సంతానానికి ఆశ్రయం దొరుకుతుంది. 27  ¶ యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు. 28  ¶ జనాభా పెరుగుదల రాజులకు ఘనత కలిగిస్తుంది. ప్రజల క్షీణత రాజుల పతనానికి కారణం. 29  ¶ వివేకం గలవాడు త్వరగా కోపం తెచ్చుకోడు. ముక్కోపికి మూర్ఖత్వమే బహుమతిగా దక్కుతుంది. 30  ¶ సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం పెంచుతుంది. అసూయ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది. 31  ¶ దరిద్రుణ్ణి కష్టపెట్టేవాడు వాడి సృష్టికర్త అయిన దేవుణ్ణి దూషించినట్టే. పేదవారిని ఆదరించేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. 32  ¶ కీడు కలిగినప్పుడు తమ చెడ్డ పనుల వల్ల భక్తిహీనులు నశిస్తారు. నీతిమంతునికి సత్య సమయంలో కూడా ఆశ్రయం దొరుకుతుంది. 33  ¶ తెలివిగలవాడి హృదయంలో జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. బుద్ధిహీనులు తమ మనసులో ఉన్నది తొందరగా బయటపెతారు. 34  ¶ ప్రజలు ఘనత పొందడానికి వారి న్యాయవర్తన కారణం అవుతుంది. అపరాధ ప్రవర్తన ప్రజలను అవమానాల పాలు చేస్తుంది. 35  ¶ తెలివి గల సేవకుడు రాజుల అభిమానం చూరగొంటాడు. అవమానం కలిగించే సేవకుడి పై రాజు కోప పడతాడు.