సామెత - 21

1  ¶ రాజు హృదయం యెహోవా చేతిలో కాలవల్లాగా ఉంది. ఆయన తన ఇష్ట ప్రకారం దాన్ని మళ్ళిస్తాడు. 2  ¶ ఒకడు ఎన్నుకున్న మార్గం అది ఎలాటిదైనా సరే, తన దృష్టికది న్యాయం గానే కనిపిస్తుంది. హృదయాలను పరిశీలించేది యెహోవాయే. 3  ¶ బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం. 4  ¶ అహంకారం గర్విష్టి హృదయం భక్తిహీనులు వర్ధిల్లడం పాపం. 5  ¶ శ్రద్ధగలవారి ఆలోచనలు లాభాన్ని తెస్తాయి. తొందరపాటుగా పనిచేసే వాడికి నష్టమే. 6  ¶ అబద్ధాలాడి ధనం సంపాదించుకోవడం మరణ సమయంలో కొన ఊపిరితో సమానం. 7  ¶ భక్తిహీనులకు న్యాయం గిట్టదు. వారు చేసే దౌర్జన్యమే వారిని కొట్టుకు పోయేలా చేస్తుంది. 8  ¶ దోషంతో నిండిన వాడి మార్గం వంకర మార్గం. పవిత్రులు రుజుమార్గంలో నడుచుకుంటారు. 9  ¶ గయ్యాళితో భవంతిలో ఉండడం కంటే మిద్దెపై ఒక మూలన నివసించడం మేలు. 10  ¶ భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ ఎంతమాత్రం కనిపించదు. 11  ¶ అపహాసకుడికి శిక్ష రావడం చూసి ఆజ్ఞాని బుద్ధి తెచ్చుకుంటాడు. ఉపదేశం మూలంగా జ్ఞానం గలవాడి తెలివి పెరుగుతుంది. 12  ¶ న్యాయం చేసే వాడు భక్తిహీనుల ఇల్లు ఏమైపోతున్నదో కనిపెట్టి చూస్తుంటాడు. దుర్మార్గులను ఆయన పడగొట్టి నాశనం చేస్తాడు. 13  ¶ దరిద్రుల మొర వినకుండా చెవులు మూసుకునేవాడు తాను మొర్ర పెట్టే సమయంలో దేవుడు దాన్ని వినిపించుకోడు. 14  ¶ చాటున ఇచ్చిన కానుక కోపాన్ని చల్లారుస్తుంది. రహస్యంగా ఇచ్చిన బహుమానం తీవ్ర కోపాన్ని సైతం శాంతింప జేస్తుంది. 15  ¶ న్యాయ క్రియలు చేయడం నీతిపరుడికి సంతోషం. పాపాత్ముడికి అది భయంకరం. 16  ¶ వివేకమార్గం తప్పి తిరిగేవాడు ప్రేతాత్మల గుంపులో కాపురముంటాడు. 17  ¶ సుఖభోగాల్లో వాంఛ గలవాడు దరిద్రుడౌతాడు. ద్రాక్షారసం, నూనెల కోసం వెంపర్లాడే వాడికి ఐశ్వర్యం కలగదు. 18  ¶ నీతిపరుని కోసం దుర్మార్గులు విడుదల వెలగా ఉంటారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాస ఘాతకులు పరిహారంగా ఉంటారు. 19  ¶ ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చెయ్యడం కంటే ఎడారిలో నివసించడం మేలు. 20  ¶ విలువైన నిధులు, నూనె జ్ఞానుల ఇళ్ళలో ఉంటాయి. బుద్ధిహీనుడు వాటిని నిర్లక్షంగా ఖర్చు చేస్తాడు. 21  ¶ నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు. 22  ¶ జ్ఞానవంతుడు పరాక్రమశాలుల నగరం పై దాడి చేస్తాడు. అతడు దాని భద్రమైన కోటను కూలదోస్తాడు. 23  ¶ నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు. 24  ¶ అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు. 25  ¶ సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి. 26  ¶ రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు. 27  ¶ దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా. 28  ¶ అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. 29  ¶ దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు. 30  ¶ యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు. 31  ¶ యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే.