సామెత - 23

1  ¶ నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు. 2  ¶ నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో. 3  ¶ అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి. 4  ¶ ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి. 5  ¶ డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది. 6  ¶ దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. 7  ¶ ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు. 8  ¶ నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది. 9  ¶ బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు. 10  ¶ పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు. 11  ¶ వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు. 12  ¶ ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు. 13  ¶ నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు. 14  ¶ బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. 15  ¶ కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. 16  ¶ నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. 17  ¶ పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు. 18  ¶ నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు. 19  ¶ కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో. 20  ¶ ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు. 21  ¶ తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది. 22  ¶ నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. 23  ¶ సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో. 24  ¶ ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు. 25  ¶ నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. 26  ¶ కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. 27  ¶ వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. 28  ¶ దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది. 29  ¶ ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు? 30  ¶ ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా. 31  ¶ ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు. 32  ¶ అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది. 33  ¶ నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు. 34  ¶ నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు. 35  ¶ “నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు.