సామెత - 24

1  ¶ దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు. 2  ¶ వారి హృదయం బలాత్కారం చేయడానికి యోచిస్తుంది. వారి నోరు కీడును గూర్చి మాటలాడుతుంది. 3  ¶ జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది. 4  ¶ తెలివి చేత దాని గదుల్లో విలువైన రమ్యమైన సర్వ సంపదలు నిండిపోతాయి. 5  ¶ జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి. 6  ¶ వివేకం గల నాయకుడివై యుద్ధం చెయ్యి. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండడం భద్రత. 7  ¶ మూర్ఖులకు జ్ఞానం అందని మాని పండే. గుమ్మం దగ్గర అలాంటి వారు మౌనంగా ఉంటారు. 8  ¶ కీడు చేయాలని పన్నాగాలు పన్నే వాడికి జిత్తులమారి అని పేరు పెడతారు. 9  ¶ మూర్ఖుని ఆలోచన పాప భూయిష్టం. అపహాసకులను మనుషులు చీదరించుకుంటారు. 10  ¶ కష్ట కాలంలో నీవు కుంగిపోతే చేతగాని వాడివౌతావు. 11  ¶ మృత్యు ముఖంలో ఉన్న వారిని తప్పించు. నాశనం వైపుకు తూలుతున్న వారిని చేతనైతే రక్షించు. 12  ¶ “చూసావా ఈ సంగతి మనకి తెలియ లేదు” అని నీవంటే సరిపోతుందా? హృదయాలను పరిశోధించేవాడు నీవు చెబుతున్నది గ్రహించడా? నీ జీవాన్ని కాపాడే వాడు నీ మాటను గ్రహించడా? మనుషులకు వారి చర్యలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? 13  ¶ కుమారా, తేనె తాగు. అది రుచికరం. తేనెపట్టునుండి కారే తేనె తినుము అది నీ నాలుకకి మధురం గదా. 14  ¶ నీ ఆత్మకు జ్ఞానం అలాటిదని తెలుసుకో. అది నీకు దొరికితే నీకు మంచి భవిషత్తు ఉంటుంది. నీకు ఆశాభంగం కలగదు. 15  ¶ మంచివారి ఇళ్ళ దగ్గర పొంచి ఉండి దాడి చేసే దురాత్ముల్లాగా ఉండకు. వారి గృహాలను పాడు చేయకు. 16  ¶ ఉత్తముడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. విపత్తు కలిగినప్పుడు భక్తిహీనులు కూలి పోతారు. 17  ¶ నీ శత్రువు పడిపొతే సంతోషించవద్దు. వాడు తూలిపడినప్పుడు నీవు మనస్సులో అనందించవద్దు. 18  ¶ యెహోవా అది చూసి అసహ్యించుకుని వాడి మీదనుండి తన కోపం చాలించుకుంటాడేమో. 19  ¶ దుర్మార్గులను చూసి అందోళన చెందకు. భక్తిహీనుల విషయం మత్సరపడకు. 20  ¶ దుర్జనుడికి పుట్టగతులుండవు. భక్తిహీనుల దీపం కొడిగడుతుంది. 21  ¶ కుమారా, యెహోవాను ఘనపరచు. రాజును ఘనపరచు. అలా చేయనివారి జోలికి పోకు. 22  ¶ అలాటి వారికి హఠాత్తుగా ఆపద వాటిల్లుతుంది. వారి కాలం ఎప్పుడు ముగిసి పోతుందో ఎవరికి తెలుసు? 23  ¶ ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయ తీర్పులో పక్షపాతం ధర్మం కాదు. 24  ¶ నీలో దోషం లేదని దుష్టుడితో చెప్పే వాణ్ణి మనుషులు శపిస్తారు. జనం అలాటి వాణ్ణి అసహ్యించుకుంటారు. 25  ¶ న్యాయంగా తీర్పు తీర్చే వారికి మేలు కలుగుతుంది. క్షేమకరమైన దీవెన అలాంటి వారి మీదికి వస్తుంది. 26  ¶ సరియైన మాటలతో జవాబివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. 27  ¶ బయట పని చక్కబెట్టుకో. ముందుగా పొలంలో సిద్ధపరచుకో. ఆ తరవాత ఇల్లు కట్టుకోవచ్చు. 28  ¶ అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా? 29  ¶ “వాడు నాకు చేసినట్లు వాడికి చేస్తాను. వాడి క్రియ చొప్పున వాడికి ప్రతిఫలం ఇస్తాను” అనుకోవద్దు. 30  ¶ సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే, 31  ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది. 32  ¶ నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను. 33  ¶ మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం, 34  వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.