సామెత - 31

1  ¶ రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, 2  కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను? 3  నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు. 4  ¶ ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు. 5  ¶ తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు. 6  ¶ ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి. 7  ¶ వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు. 8  ¶ మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు. 9  ¶ నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి. 10  ¶ సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది. 11  ¶ ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు. 12  ¶ ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు. 13  ¶ ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది. 14  ¶ వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. 15  ¶ ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది. 16  ¶ ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది. 17  ¶ ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది. 18  ¶ తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. 19  ¶ ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది. 20  ¶ దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది. 21  ¶ తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు. 22  ¶ ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు. 23  ¶ ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి. 24  ¶ ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది. 25  ¶ బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది. 26  ¶ ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది. 27  ¶ ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు. 28  ¶ ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు. 29  ¶ “చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు. 30  ¶ చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు. 31  ¶ ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.