సామెత - 5

1  ¶ కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు. 2  ¶ అప్పుడు నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటావు. నీ తెలివితేటలను బట్టి నీ నోరు మాట్లాడుతుంది. 3  ¶ వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి. 4  ¶ చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది. 5  ¶ దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది. 6  ¶ జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది. 7  ¶ కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు. 8  ¶ వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు. 9  ¶ నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది. 10  ¶ అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది. 11  ¶ చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి. 12  ¶ అప్పుడు నువ్వు, అయ్యో, ఉపదేశాన్ని నేనెందుకు లక్ష్యపెట్టలేదు? నా మనస్సాక్షి గద్దింపును ఎందుకు తిరస్కరించాను? 13  ¶ నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు. 14  ¶ సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను, అని నీకు నువ్వు చెప్పుకుంటూ మధనపడతావు. 15  ¶ నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు. 16  ¶ నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా? 17  ¶ పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా. 18  ¶ నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు. 19  ¶ ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు. 20  ¶ కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు? 21  ¶ మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు. 22  ¶ దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు. 23  ¶ అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు.