కీర్తన - 124

1  ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, 2  మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, 3  వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు. 4  నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి. 5  జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి. 6  వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి. 7  వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము. 8  భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.