కీర్తన - 14

1  దేవుడు లేడు, అని బుద్ధిలేని వాడు తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన పాపం చేసిన వాళ్ళు. మంచి చేసేవాడు ఎవడూ లేడు. 2  వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు. 3  ప్రతిఒక్కడూ దారి తొలగిపోయాడు. వారంతా రోతగా ఉన్నారు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనా లేడు. 4  యెహోవాకు ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేసేవాళ్ళందరికీ తెలివి లేదా? 5  వాళ్ళు భయంతో వణికిపోతారు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుల సభతో ఉన్నాడు. 6  యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు. 7  సీయోనులోనుంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు గాక! యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబులో ఆనందం, ఇశ్రాయేలులో సంతోషం కలుగుతుంది.