కీర్తన - 52

1  బలశాలీ, సమస్యను సృష్టించి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది. 2  నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది. 3  నువ్వు మంచి కంటే దుర్మార్గాన్ని ఎక్కువ ప్రేమిస్తావు. న్యాయం మాట్లాడటం కంటే అబద్దం మాట్లాడటం నీకిష్టం. 4  కపటమైన నాలుకా! ఇతరులను మింగేసే మాటలను నువ్వు ప్రేమిస్తావు. 5  కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు. 6  న్యాయవంతులు అది చూసి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారు. వారు నవ్వుతూ ఇలా అంటారు. 7  చూడండి, ఇతడు దేవుణ్ణి తన బలంగా చేసుకోకుండా తనకున్న అధిక ఐశ్వర్యంపై నమ్మకముంచాడు. నాశనకరమైన తన మార్గంలోనే స్థిరంగా నిలిచాడు. 8  కానీ నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవుని నిబంధన కృపలో నేను ఎన్నటికీ నమ్మకముంచుతాను. 9  దేవా, నువ్వు చేసిన వాటిని బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నీ భక్తుల సమక్షంలో నీ నామాన్ని బట్టి ఆశతో ఎదురుచూస్తాను.